-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

4 March 2019

అలసిన వానికి ఊరడించు మాటలు

🌷సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన🌷
"అలసిన వానికి ఊరడించు మాటలు"

"నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక  నీ పూర్ణ హృదయముతో  యెహోవా యందు నమ్మకముంచుము"
( సామెతలు 3:5)

మనము దేవుని నడిపింపును   నిర్లక్ష్యము చేయుట ద్వారా, ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించుట  ద్వారా ఆత్మీయముగా గ్రుడ్డివారమగుదుము. ఈ దినములలో అనేకమంది విశ్వాసులు తమ అవిధేయతను బట్టి, పాక్షిక విధేయతను బట్టి దేవుని విషయమైన తమ దర్శనమును కోల్పోవుచున్నారు..  ఉదాహరణకు, రాజైన సౌలు దేవునికి, పాక్షిక విధేయత చూపించుట  చేతనే అతడు దేవునిచేత తృణీకరించబడెను. దావీదు కూడా జనసంఖ్య ఎంతైనది లెక్కించవలెననెడి శోధనలోబడి, తన బలమును బట్టి గర్వించెను ( 2 సమూ. 24:2,3) తాను  పొందిన విజయములన్నియు  దేవుని వలననే కలిగినవనియు, తన సైన్య  బలమును బట్టి ఏ మాత్రమును కాదని, దావీదుకు బాగుగా తెలియును.  తన బలమును బట్టి గాని, తెలివితేటలను  బట్టి గాని తాను గొల్యాతును ఓడించలేదు. అతడు సైన్యములకధిపతియగు యెహోవా నామమున యుద్ధము చేసి గొల్యాతును ఓడించెను ( 1 సమూ. 17: 45,50) అయినప్పటికిని  తన వృద్ధాప్యములో తన సైన్య బలమును లెక్కించవలెనను శోధనకు  గురియయ్యెను . సైన్యాధిపతియగు యోవాబు దావీదును ఈ పొరబాటునుండి తప్పించుటకు ప్రయత్నించెను గాని దావీదు తీర్మానమే నెగ్గెను. దావీదు నేత్రములు అత్యధిక సంఖ్యలోనున్న తన ప్రజలపై నున్నవి గాని, దేవుని మీద లేవు. అందుచేతనే దేవుడు అతనికి కళ్లములో  సాగిలపడి ప్రార్ధించు అనుభవములోనికి తెచ్చెను. ఆ విధముగా దావీదు ప్రభువునందు నమ్మకముంచుటకు నేర్చుకొనెను.

 ఈ విధమైన శోధన మనకందరికిని వచ్చును. శోధనలను జయించుటకు లేక దేవుని సేవచేయుటకు, మన స్వశక్తి పై, సామర్ధ్యముపై, జ్ఞానముపై  ఆధారపడుటకు మనము శోధించబడుదుము. చాలామంది వారి కెమెరాలు, భవనములు, ఆస్తిపాస్తుల మీద ఆధార పడుదురు. వీటన్నిటిని కలిగి యుండుట ద్వారా మంచి ఫలవంతముగా కాగలమని తలంచుదురు. ప్రతి పరిస్థితి లోను మంచి ఫలవంతమైన పరిచర్య కొరకు మనలను మనము ఆయనకు అప్పగించుకొనవలెను. బోధకులు సహితము గతకాలములో తాము పొందిన ఆశీర్వాదములపై, తాముసాధించిన విషయములపై ఆధారపడినయెడల గొప్ప ఫలమును పొందు అవకాశమును కోల్పోవుదురు. ప్రతి దినము మన ప్రభువైన దేవుని, మన నాలుకను , పెదవులను , గొంతును తాకి, తన ప్రజల కొరకైన ఆయన స్వంత వర్తమానము నివ్వవలసినదిగా అడుగవలెను. అప్పుడు మాత్రమే మన పరిచర్య ఆశీర్వదించబడి, జీవ యుక్తముగాను మరియు ఫలవంతముగాను ఉండును.

ప్రతిదినము మనము మోకాళ్లపైకి వెళ్లి ప్రభువును. మనలను   అభిషేకించుమని, నూతన వర్తమానము నిమ్మని  అడుగుట ఎంతో అవసరమై యున్నది. మనము వర్తమానముల కొరకు సిద్ధపడుటకై మన తెలివితేటలపై గాని, సామర్ధ్యము , బలముపై గాని ఆధారపడకూడదు. ఎందుచేతననగా అది మనలను ఉపయోగకరమైన, విజయవంతమైన జీవితమునకు నడిపించదు.  దీనినంతటిని బోధించుటకై, దేవుడు యెహోషువతో ప్రజలకు సున్నతి  చేయించుమని చెప్పెను. తమ స్వంత యుద్ద ఆయుధములపైగాని, గొప్ప సైన్య సమూహముపై గాని వారి స్వంత జ్ఞానము, ప్రణాళికపై గాని ఆధారపడకుండా, ప్రభువు యొక్క బలముపై  ఆధారపడుటవలన మాత్రమే వారు ఆ ఏడు గొప్ప జాతుల వారిని జయించి, కనాను దేశమును స్వాధీన పరచుకొనగలరని వారికి జ్ఞాపకము చేసెను.
Please share

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics