నెహెమ్యా చేసిన ప్రార్ధన
చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూ షలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.
ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.
నెహెమ్యా 1:3,4
👉 నెహెమ్యా షూషను కోటలో రాజుకు గిన్నె అందించే వాడు. అతడు చేస్తున్న ఉద్యోగమును బట్టియే చెప్పవచ్చు. అతడెంత నమ్మకస్థుడో?
అర్తహషస్త రాజు పాలనలో నెహెమ్యా రాజుకు ద్రాక్షారసము అందించు చుండగా నెహెమ్యా ముఖము బహు దుఃఖముతో నున్నట్లు రాజు గమనించి, నెహెమ్యా ఈ దినము నీకేమయ్యింది? ఎందుకు అట్లా వున్నావు అంటూ క్షేమ సమాచారం అడిగినప్పుడు,
నా పితరుల సమాధులుండు పట్టణము పాడయిపోయింది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అంటూ తన దుఃఖానికి గల కారణాన్ని తెలియజేశాడు.
అయితే, నీ కోసం నేనేమి చెయ్యాలి అని రాజు అడిగినప్పుడు, నేను యూదా దేశము వెళ్లి యెరూషలేము ప్రాకారము కట్టించుటకు అనుమతిని, వాటికి కావలసిన దూలములు మ్రానుల కొరకు రాజును వేడుకొనగా తాను అడిగిన సమస్తమును రాజు అతని కోసం సిద్ధ పరచెను. అంతేకాదు, అతనితో పాటు సేనాధిపతులను, గుర్రపు రౌతులను కూడా పంపించాడు.
👉 అవును!
అసలు దేవుని గురించిన భారమంటూ నీకుంటే?
👉 ఆయన పనిని ఆయనే కొనసాగిస్తాడు.
నెహెమ్యా రాజుతో మనవి చేయకముందే, నెహెమ్యా మనసును రాజు గ్రహించడానికి దేవుడు కృప చూపాడు.
🔺 మన ఆత్మీయ ప్రాకారాలు కూలిపోతున్నాయి, అగ్నితో కాల్చ బడుతున్నాయి. సాతానుడు నేరుగా సంఘాలలో, కుటుంబాలలో ప్రవేశించి విచ్చిన్నం చేస్తున్నాడు. అయితే, మనకు వాటిని గూర్చిన భారం కరువయ్యింది.
🔺 ఆత్మీయ ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. దాని కోసం నీవూ నేనూ ఒక ఎజ్రా వలే, నెహెమ్యా వలే అట్లాంటి భారాన్ని కలిగి యుండాలి.
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!
గిద్యోను చేసిన ప్రార్ధన
ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్పగించెను.ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరినప్పుడు వారు యెహోవాకు ప్రార్ధన చేశారు. అట్లాంటి సందర్భములో దేవుడు వారిని విడిపించడానికి గిద్యోనును ఏర్పాటు చేసుకున్నాడు.
🔹 గిద్యోను మనష్షే గోత్రమునకు చెందిన వాడు.
🔹 యోవాషు కుమారుడు
యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా
👉 గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవిం చెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.
న్యాయాధి 6:12,13
యెహోవా దూత గిద్యోనును సంభోధించిన విధానము మనకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పరాక్రమము కలిగిన బలాఢ్యుడా! వాస్తవానికి గిద్యోను మిద్యానీయులకు బయపడి పిరికివానిలా గానుగ చాటున గోధుమలు దుళ్ల గొట్టుకొంటున్నాడు.
అవును! పిరికివానికి సహితం దేవుడు తోడైవుంటే అతడు బలాఢ్యుడు గానే మారతాడు.
మనము ప్రశ్నిస్తున్నట్లుగానే గిద్యోను కూడా దేవునిని ప్రశ్నిస్తున్నాడు, ప్రార్ధిస్తున్నాడు. దేవుడు మాకు తోడైవుంటే? ఈ శ్రమలెందుకు? ఈ శోధనలెందుకు? ఆ అపజయాలెందుకు?
గిద్యోను ప్రార్థనకు సమాధానముగా
దేవుడు గిద్యోనుకు ఇచ్చిన వాగ్ధానము
నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.
న్యాయాధి 6:16
అట్లా మిడతల దండంత విస్తారమైన మిద్యానీయుల సైన్యాన్ని గిద్యోను కేవలం 300 మంది సైనికులను తీసుకెళ్లి వారిమీద విజయం సాధించాడు.
👉 నీ సమస్య ఎంతయినా కావొచ్చు, దేవుడు నీకు సహాయకుడైతే ఆ సమస్య, సమస్యే కాదు. కానీ, ఆయన సహాయం మనకెట్లా లభిస్తుంది? ప్రార్ధించడం ద్వారానే.
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!
జెకర్యా చేసిన ప్రార్ధన
అప్పుడా దూత అతనితో జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
లూకా 1:13
🔹 జెకర్యా యాజకుడు
🔹 అతని భార్య ఎలీసబెతు
🔹 వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు.
🔹 వీరికి సంతానము లేక బహుకాలము గడచిన వృద్ధులు.
అయితే, జెకార్యా సంతానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్ధిస్తూనే వున్నాడు. వివాహమయిన సమయం నుండి వృద్ధాప్యము వరకు ప్రార్ధిస్తూనే వున్నాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రార్ధించాడో కూడా తెలియదు. మొత్తానికి అతని ప్రార్ధన పరీక్షకు నిలబడగలిగి దేవుని దగ్గర నుండి స్పష్ట మైన సమాధానాన్ని తీసుకు రాగలిగింది.
దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్ధానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైనది అంటే? పుట్టబోయే బిడ్డకు పెట్టవలసిన పేరును కూడా తెలియజేసాడు. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో? ముందుగానే స్పష్టముగా తెలియజేసాడు.
జెకర్యా ఆత్మీయంగా బలవంతుడైనప్పటికీ అతని శారీరిక స్థితి (వృద్ధాప్యం) దేవుని వాగ్ధానమును నమ్మకుండా అడ్డుపడింది. ఫలితంగా ఆ బిడ్డ పుట్టేవరకు మూగవాడయ్యాడు.
ఏది ఏమయినా, అతని ప్రార్ధనా ఫలితంగా గొప్ప ఆశీర్వాదకరమైన కుమారుడు వారి గర్భాన జన్మించాడు.
అతడెంత గొప్పవాడో యేసు ప్రభువువారే సాక్ష్య మిచ్చారు.
స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
మత్తయి 11:11
🔺 అవును!
అనేక సందర్భాలలో మన చుట్టూనున్న పరిస్థితులు చూచి, మన ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే నమ్మకాన్ని కోల్పోతాము.
👉 అయితే, మనము సమస్యను కాదు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించే దేవునివైపు చూడాలి.
నీవు చేసే ప్రార్ధన వ్యర్థంకాదు. తప్పక ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది.
ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో గాని, అలక్ష్యం మాత్రం చెయ్యడు. ఆ ఆలస్యంలో కూడా శ్రేష్టమైన మేలును దాచివుంచుతాడు.
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
హల్లెలూయ...
మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!
No comments:
Post a Comment