ఆత్మఫలం
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
గలతియులకు 5: 22
1⃣ ప్రేమ
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటప్పుడు కలిగే ఆత్మఫలం లో మొదటిది ప్రేమ.
👉 ఇది ఎంత లోతైనదంటే సాటి మనిషి కోసం ప్రాణమైనా ఇవ్వగలిగినంత లోతైనది.
👉 ఈ "ప్రేమను" దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిగా జన్మించి, జీవించి చూపించాడు. యేసు క్రీస్తుగా తాను మనుషులందరి మీద చూపించిన " ప్రేమనే" ఆయనను నమ్ముకున్న వారంతా ఒకరి ఎడల ఒకరు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు.
👉 అలా చెయ్యడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈ ప్రేమ కోసం బైబిల్ లో ఏమి వ్రాసి ఉందంటే
▪ఈ ప్రేమలో దీర్ఘశాంతం ఉంటుంది.
▪ఈ ప్రేమ దయ చూపిస్తుంది.
▪ఈ ప్రేమకు అసూయ అనేదే ఉండదు.
▪ఈ ప్రేమ డంబాలు చెప్పుకోదు, అంటే గొప్పలు చెప్పుకోదు. అది గర్వంతో ఉప్పొంగి పోదు. అయోగ్యంగా ప్రవర్తించదు. స్వంత ప్రయోజనం చూసుకోదు. తనను ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోదు. ఎవరైనా తనకు ఏ అపకారం చేసినా దాన్ని పట్టించుకోదు.
👉 ఈ ప్రేమ చెడ్డ విషయాల్లో ఏమాత్రం సంతోషించదు గాని, మంచి విషయంలోనే సంతోషిస్తుంది.
ఈ ప్రేమ అన్నిటినీ భరించుకుంటుంది, అన్నింటినీ నమ్ముతుంది, అన్నిటి విషయంలో ఆశాభావం కలిగి ఎదురుచూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది.
బైబిల్ వివరించిన ఈ ప్రేమ ఎప్పటికీ అంతం కాదు. అలాంటి ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను నింపును గాక… ఆమేన్.
2⃣ సంతోషం అంటే ఏమిటి ?
👉సంతోషం అనే మాట ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. కానీ దాన్ని చాలా తక్కువగా కలిగి ఉంటాం.
👉చాలా మంది దీన్ని తమ పేరుగా కలిగి ఉంటారు. కానీ నిజానికి వారిలో చాలామందికి సంతోషంగా ఉండే సమయాలు, పరిస్తితులు చాలా తక్కువగా ఉంటాయి.
👉 నిజంగా నిరంతరాయంగా మీరు సంతోషంగా జీవించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది.
అదేమిటంటే, మీ సృష్టికర్త అయిన దేవుని మాటలను చదివి, విని వాటి ప్రకారం జీవించడమే.
బైబిల్ గ్రంధంలో మొదటి దినవృత్తాంతములు, 16వ అధ్యాయం, 27వ వచనంలో ఇలా వ్రాసి ఉంది. “ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి లో ఉన్నవి. బలమును, సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి”. 16 వ కీర్తన 11 వ వచనంలో “నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు” అని వ్రాయబడి ఉంది.
👉అవును, దేవుని సన్నిధి నుండి మనకు అనుగ్రహింపబడిన సంతోషమే నిజమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం.
👉దేవునితో సంబంధం లేని సంతోషం క్షణ మాత్రమే ఉంటుంది. యోబు గ్రంథం 20వ అధ్యాయం, 4వ వచనం లో
“భక్తిహీనులకు సంతోషము ఒక నిమిష మాత్రం ఉండును” అని వ్రాయబడి ఉంది. అది నిజమే కదా.
సర్వసృష్టికర్త అయిన దేవునితో ఏ మాత్రం సంబంధం లేని మనుషులు తాము చేసే చెడు పనులు లోనే సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు కాబట్టి వారికి కలిగే సంతోషం ఒక్క క్షణమే ఉంటుంది. మళ్లీ ఏదో చెడ్డ పని చేసేంత వరకు వాళ్ళ హృదయాలు, మనసులు తీవ్రమైన అశాంతితో నిండి ఉంటాయి.
ఇలాంటివారు యేసుక్రీస్తు ప్రేమను రుచి చూడాలి. యేసుక్రీస్తు రక్త ధారల క్రింద వారి జీవితాలు తడపబడి శుద్ధి చేయబడాలి. యేసు క్రీస్తు తో సహవాసం కలిగి ఉండడమే సర్వ సృష్టి కర్త అయిన దేవునితో సంబంధం కలిగి ఉండడం. అలాంటి వారికే సంతోషం అనేది నిజంగా, నిరంతరాయంగా కలుగుతూ ఉంటుంది.
👉 మనం చేసే పొరపాట్లు, అపరాధాలు, తప్పులు, దోషాలు, పాపాలు అనేవి దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని దోచుకుంటాయి. అలాంటి సమయాల్లో మళ్ళీ మనం యేసుక్రీస్తు పాదాల దగ్గరకు చేరి పాప క్షమాపణ కోసం వేడుకొని, మనం చెడ్డ మార్గాలను విడిచిపెడితే నిజమైన సంతోషం మనలోకి ప్రవేశిస్తుంది. యేసుప్రభువును విడిచి పెట్టకండి. సంతోషం మిమ్మల్ని విడిచి పెట్టదు. ఆమేన్.
3⃣ సమాధానం
సమాధానం అనే మాటను మన వాడుక భాషలో అయితే జవాబు అనే మాటకు మారుగా వాడతాం.
అయితే బైబిల్ భాషలో సమాధానం అంటే శాంతి అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే తగువు తంటాలు లేకుండా, గొడవలు లేకుండా, వ్యతిరేక భావం లేకుండా, ఎడమొఖం పెడమొఖం పెట్టుకోకుండా, ఒకరియెడల ఒకరు సుహృద్భావంతో మంచిగా ఉండటాన్ని సమాధానంగా ఉండటం అంటారు.
🔺 ఇది మూడు కోణాల్లో ఉండాలి.
🔹మొట్టమొదటిగా ప్రతి మనిషి తనలో తానే సమాధాన స్థితిని కలిగి ఉండాలి. అంటే నీ మనస్సాక్షి నీకు వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు, నీ మనస్సాక్షి సమాధానం గా ఉండాలి.
🔹 తరువాత ప్రతి ఒక్కరు తమ సాటి మనుషులతో సమాధానం గా ఉండాలి. అలా ఉండేలా ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
🔹 ఇక చివరిగానైనా అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆ సృష్టికర్త అయిన దేవునితో సమాధానం కలిగి ఉండాలి.
👉 ఈ మూడు సమాధాన స్థితులు కలిగినప్పుడు మనిషి జీవితం ప్రశాంతంగా ఉన్నట్టు లెక్క.
నీలో నీకు సమాధానం లేకపోయినా, సాటి మనిషితో నీకు సమాధానం లేకపోయినా, నీ సృష్టికర్తయైన దేవునితో నీకు సమాధానం లేకపోయినా, వెంటనే రక్షకుడైన యేసుక్రీస్తును వేడుకో. అన్ని కోణాల్లో దాన్ని సంపాదించుకో... ఆమేన్.
4⃣ దీర్ఘశాంతము
దీర్ఘకాలం శాంతంగా ఉండగలగడాన్ని దీర్ఘశాంతం అని అంటారు.
👉 దీర్ఘం అంటే చాలా ఎక్కువ కాలం అనే కదా అర్థం. కాబట్టి దీర్ఘశాంతం అనే గుణాన్ని కలిగి ఉన్నవారు అంత త్వరగా కదిలిపోరు. వారిలో ఓర్పు, సహనం అనేవి ఎక్కువగా ఉంటాయి.
సాధారణ మనుషులు తమ కోపం చూపించడానికి ఎంత ఓపిక పడతారో, సహనం చూపిస్తారో, దానికి కొన్ని లక్షల రెట్లు దీర్ఘశాంతం అనే గుణాన్ని కలిగిన వారు ఓపిక పడతారు, సహనం చూపిస్తారు. చెప్పాలంటే ఈ "దీర్ఘశాంతం" అనే గుణం ఉన్నవారు అత్యంత మానసిక శక్తి కలిగి ఉన్నవారు అన్నమాట.
♻ సర్వసృష్టికర్త అయిన దేవుడే దీర్ఘశాంతుడై యేసు క్రీస్తు రూపంలో మనిషిగా ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి తన దీర్ఘశాంతం అంతా చూపించాడు.
ముఖ్యంగా దుర్మార్గులైన మనుషులు ఆయనను అతి ఘోరమైన, నీచమైన, సిలువ శిక్షకు అన్యాయంగా అప్పగించినప్పుడు ఆయన చూపించిన దీర్ఘశాంతం మనకిప్పుడు మాదిరిగా ఉంది. మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఆ ప్రభువు దీర్ఘశాంతం చూపిస్తూ, మన జీవితాల్లో మంచి మార్పు కోసం రోజు రోజు ఎదురు చూస్తున్నాడు.
దేవుని దీర్ఘశాంతాన్ని ఇంకా మనం పరీక్షించకుండా ఆయన మార్గం లోకి వద్దాం. మనం కూడా ఆయనలా దీర్ఘశాంత గుణాన్నిఅలవాటు చేసుకుందాం.
అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక… ఆమేన్
5⃣ దయాళుత్వము
దయాళుత్వము ఈ పదం పలకడానికే కష్టంగా ఉంది కదూ! దయ కలిగిన మనసునే దయాళుత్వం కలిగి ఉండడం అంటారు.
👉 కొన్ని తర్జుమాలలో దీనినే జెంటిల్ నెస్, అని స్వీట్ నెస్ అని కూడా రాశారు. ఇంగ్లిష్ లో ఈ దయాళుత్వాన్ని కైండ్ నెస్ అంటారు.
▪ మనం దయ చూపించడానికి ఎదుటి వ్యక్తిలో ఏ అర్హత, యోగ్యత ఉండనక్కరలేదు.
ఎదుటి వ్యక్తి పరిస్థితిని బట్టి అది మంచిదైనా, చెడ్డదైనా వారి మీద దయ చూపించడం అనేది పరిశుద్ధాత్మ వలన మనలో కలిగే ఆత్మ ఫలానికి గుర్తు.
👉 దయ కలిగిన హృదయం కఠినంగా వ్యవహరించాలనుకున్నా అలా చేయలేదు. అయితే ఒక మనిషిలో పరిశుద్ధాత్మ ఫలంగా కలిగిన దయాగుణాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే వాళ్ళు దైవ తీర్పునకు గురి అవుతారు.
మనం దయా హృదయంతో ఎదుటి వారికి మేలు చేసినప్పుడు దాన్ని వారు అలుసుగా తీసుకుంటే, లేకపోతే అది మన బలహీనతగా తీసుకుంటే, మనం నష్టపోయేది ఏమీ ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆ దయాగుణాన్ని మనలో పుట్టించి మనం ఎదుటి వారి యెడల దయ చూపించేలా చేస్తున్నాడు కాబట్టి ఇక మిగతా విషయాలు కూడా ఆయనే చూసుకుంటాడు.
👉 ఎదుటివారి అపనమ్మకత్వం కారణంగా మనలోని దయాగుణాన్ని పోగొట్టుకో నక్కరలేదు. ఈ విషయం మనకు సరిగ్గా అర్థమయ్యేలా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక… ఆమేన్.
6⃣ ఆశా నిగ్రహం
“సెల్ఫ్ కంట్రోల్” అని అంటారే, అదే ఈ ఆశా నిగ్రహం.
మనో నిగ్రహం అనే మాట అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ రెండు పదాలు మనం సందర్భాన్ని బట్టి వాడుకోవచ్చు.
ఆశా నిగ్రహం లేదా మనో నిగ్రహం అనేది, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ద్వారా పాప క్షమాపణ పొంది, అపరాధ భావన నుండి విడుదల పొంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు, ఆత్మ ఫలంగా ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది.
అప్పటి నుండి ఆశా నిగ్రహాన్ని అంటే మనో నిగ్రహాన్ని కాపాడుకుంటూ, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఆచరణలో పెడుతూ, దానిలో అభివృద్ధి పొందడం అనేది ఆ వ్యక్తి బాధ్యత. అందుకు దాన్ని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుడే నిరంతరం సహాయం చేస్తుంటాడు.
👉 ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అన్నిటిలో మితంగా ఉండడానికి అంటే లిమిట్ లో ఉండటానికి మనకు సహాయపడుతుంది. మన భావోద్రేకాలను సమతుల్యంగా ఉంచేది అంటే బ్యాలెన్స్ చేసేది ఈ ఆశా నిగ్రహమే /మనోనిగ్రహమే.
మన కోరికలు, ఆశలు, ఇచ్ఛలు, వాంఛలు, ఇలాంటివన్నీ పరిశుద్ధాత్మ శక్తి తో నిగ్రహించుకుంటూ, సమతుల్యత పాటిస్తూ, జీవిస్తేనే ఆ జీవితం అర్థవంతంగా ఉంటుంది. సార్ధకం అవుతుంది. అందుకు దేవుని కృప మనకు సహాయం చేయును గాక… ఆమేన్
No comments:
Post a Comment