-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

7 April 2020

రారాజు వస్తున్నాడు.... సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు.




యోహాను 12:14
సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు.

👉రారాజు తనను స్వీకరించే వారందరికొరకు వస్తున్నాడు.

అత్యంత ప్రజాదరణ వ్యక్తులు ఎవరైనా వస్తుంటే, వారిని ఊరేగింపుతో ఉత్సాహంగా ఆహ్వానించి తీసికొని రావడం సాధారణమైన విషయం.
👉 యేసుని కూడా అదే విధంగా ఊరేగింపుతో యేరూషలేము లోనికి ఆహ్వానిస్తున్నారు. 

సిలువ వేయబడటానికి ఆయన యెరూషలేములో ప్రవేశించిన సమయానికి, యేసు  యొక్క ప్రాముఖ్యత యేరూషలేములో పెరిగింది. పస్కా పండుగ విందు సందర్భంగా యేరూషలేములో కనీసం 27,00,000 మంది ప్రజలు హాజరవుతారని ఒక అంచనా.
👉యేరూషలేములో ఆయనను ఆయనను ప్రేమించినవారు చాలామంది ఉన్నారు అంతేకాకుండా ఆయనను ద్వేషించిన వారుకూడా ఉన్నారు.

యేరూషలేములో యేసు ప్రవేశించిన ఈ దినంతో ఆయన భూలోక జీవిత ముగింపు దినాలు ఆరంభమైనట్లే. వాస్తవానికి యేసు యొక్క యేరూషలేము ప్రవేశం అనేది చాలా అత్యుత్తమ ధైర్యంతో కూడుకొనిన చర్య.
👉 కాని ప్రభువు పాపులను ప్రేమించుటకు ఈ లోకానికి వచ్చాడు గనుక మానవుల మీద ఎంతో ప్రేమతో ఆయన ఈ అత్యుత్తమమైన సాహసానికి పూనుకొన్నాడు.

యేసు యొక్క యేరూషలేము విజయోత్సవ ప్రవేశం, పస్కా పండుగకు హాజరైన ప్రజల కొరకు ఏమైయున్నదో దీని ద్వారా మనం ఏమి నేర్చుకొనవలసి యున్నదో మొదలగు విషయాలను క్లుప్తంగా పరిశీలన చేద్దాం.

రారాజు వస్తున్నాడు:

1. రారాజు యెరూషలేము ప్రవేశం ఒక ప్రవచన నేరవేర్పుగా వున్నది:

 వచ్చుచున్న రాజు గురించి జెకర్యా చెప్పిన ప్రవచన నెరవేర్పుగా ఉన్నది.
 (జెకర్యా 9:9  సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.)

యేసు యొక్క యెరుషలేము ప్రవేశం గురించి మత్తయి, మార్కు, లూకా కూడా వ్రాశారు గాని జెకర్యా ప్రవచనాన్ని చూపుతూ వ్రాసింది యోహాను మాత్రమే.
 (యోహాను  12:14-15 సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.)

యేరుషలేములో పస్కా పండుగకు హాజరైన “సియోను కుమారికి” అనగా లక్షల మంది అశేష యూదా జనసందోహానికి జెకర్యా  ప్రవచనార్థక సందేశం యొక్క భావం ఏమై యున్నది?  దీని అర్థం ఏమిటి?

2. రారాజు యెరూషలేము ప్రవేశం అనేకుల అంచనాలు తారుమారు చేసింది:

 సుదీర్ఘకాలంగా సియోను కుమారి అనబడే యూదా ప్రజలు మెస్సియా“రాజు” కొరకు చాల గొప్ప గొప్ప అంచనాలు గలిగి ఎదురు  ఎదురు చూస్తున్నారు. రోమా చక్రవర్తి బానిస సంకెళ్ళనుండి విముక్తి కలిగించే ఒక యుద్ధ వీరుడు “రాజుగా” గుర్రం ఎక్కి ఠీవిగా  రావడాన్ని వారు ఊహించారు.
👉 అయితే యేసు ఆ విధంగా రాలేదు.
వాస్తవ అంచనాలు గాడిదమీద దీనుడుగా వచ్చాడు. దీంతో వారి అంచనాలు తారుమారై యూదా ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఎన్నో యుగాలుగా మెస్సియా  గురించి ఎదురు చూస్తున్న వారికి ఆయన యెరుషలేములో ప్రవేశించిన తీరు ఎంతో నిరాశకు గురిచేసి మెస్సియాపై పెట్టుకొన్న వారి విశ్వాసం చెదిరిపోయినది. మనం కూడా ఒకొక సారి ఇలాగే విశ్వాస విషయంలో పొరబాటు పడతాం.

కాని లేఖనాల గురించి సరైన అవగాహన, మన నిరాశను తప్పించి, మన విశ్వాసాన్ని బలపర్చడానికి మనకు సహాయంచేస్తుంది.

3. రారాజు యెరూషలేము ప్రవేశ విధానం అనేకులకు కలవరం కలుగ జేసింది:

 యేసు యెరుషలేము ప్రవేశం చేసిన విధానం చూచిన అనేకులు ఆయన మెస్సియా కాదేమో అనే అయోమయానికి గురయ్యారు. అంతేకాకుండా ఒకవేళ ఈయనే మెస్సియా అయితే, మరి ఇటువంటి దీనమైన స్థితిగలిగివున్న మెస్సియా తమకు ఏమి సహాయం చేయగలడని కలవరానికి గురై ఆయన గుర్తింపు గురించి అనేక ప్రశ్నలు కలిగినవారుగా ఉన్నారు. (మత్తయి 21:10 ఆయన యెరూషలేము లోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను.)

అనగా ప్రభువు వచ్చినా గాని ఆయనను పోల్చుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. మనలో కూడా అనేకులు యెరుషలేము ప్రజల మాదిరిగా యేసును సరిగా గుర్తించలేని స్థితిలో ఉంటున్నాము.

ఒకసారి యేసు మనుష్యకుమారుడు ఎవడు అని ప్రజలు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను.
 (మత్తయి 16:13 మనుష్య కుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తనశిష్యులను అడుగగా). ఒకవేళ ప్రభువు ఇదే ప్రశ్న మనలను అడిగితే దానికి మన సమాధానం ఏమిటి?

పేతురు ఒక్కడే యేసును సరిగా గుర్తించ గలిగాడు.
“నీవు జీవంగల దేవుని కుమారుడైన క్రీస్తువు” అని పేతురు అన్నాడు (మత్తయి 16:16).

4. రారాజు యెరూషలేము ప్రవేశం మతాధికారులకు భయాన్ని కలుగ జేసింది:

 అయితే పరిసయ్యులకు, యూదా మతాధికారులకు యేసు యొక్క ఎరుషలేము ప్రవేశం దిగులును భయమును కలుగ చేసినది.
 (యోహాను 12:19  కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.)

👉ఆయన యెరుషలేము ప్రవేశం, పరిసయ్యులలో మతపరమైన హోదాలో భాగంగా వారికి భయము కలిగింది.

ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క రెండవ రాకడ కూడా నామకార్ధ క్రైస్తవులకు ఇటువంటి భయాన్నే కలుగ జేయబోవుచున్నదనేది వాస్తవం. 

5. రారాజు యెరూషలేము ప్రవేశం అనేకులకు రక్షణానందాన్ని కలుగ జేసింది:

యేసు రక్షణ గలవాడుగా ఎరుషలేములో ప్రవేశించాడు: (జెకర్యా 9:9  సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును)  అనగా అర్దమేమంటే,  ఆయన ఎరుషలేము యొక్క రాకడ  ఏమి తెలియ జేయుచున్నదంటే,
👉 ఆయన ప్రతి ఒక్కరికి, రక్షణను తెచ్చాడు.

కొంతమంది ఆయన స్వంత వారే ఆయనను తిరస్కరించారు. ఈ దినాలలో కూడా అనేకులు క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన బిడ్డలే ఆయనను తిరస్కరిస్తున్నారు. (యోహాను 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.)

మరి కొంతమంది ఆ రక్షణను సంతోషంగా ఉల్లాసంగా అందుకున్నారు
 (యోహాను 1:12  తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను) ఆయన్ను నమ్ముకున్న వారు వచ్చుచున్న రాజుని తమ హృదయాలలోనికి ఘనంగా ఆహ్వానించుకున్నారు.

"(మత్తయి 21:9 జన సమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును  దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింప బడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి).

దీని అర్థం ఏమంటే క్రీస్తు, రాజుగా నిరంతరం తన ప్రజల దగ్గరకు వస్తున్నాడని అర్థం

6. రారాజు యెరూషలేము ప్రవేశం సమాధానం ఇస్తున్నది:

(జెకర్యా 9:10 ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజను లకు తెలియజేయును,.)

గుర్రం మీద రాకుండా ఆయన గాడిద మీద రావడం అనేది ఆయన యొక్క దీనత్వాన్ని అనగా యేసు యొక్క యెరుషలేము ప్రవేశం ఆయన
🔹 సమాధానానికి కర్త అని రుజువు చేసింది.

అసలు యేసు ఎవరు ఆయన నగరానికి ఎందుకు వస్తున్నాడో అనే విషయాలపై పూర్తిగా ప్రజలకు అవగాహన లేదు. పైగా యేసు ఒక గాడిదపై యెరూషలేముకు ఎందుకు ప్రవేశించాడో ఎవరికీ అర్ధం కాలేదు. కనీసం శిష్యులకు కూడా అర్థం కాలేదు.

భారత దేశంలో గాడిదకు గౌరవం అనేది పెద్దగా లేదు. కాని తూర్పు దేశాలలో అలా కాదు. తూర్పు దేశాలలో గాడిద ఒక గొప్ప జంతువు. తూర్పు చేశాల "ఆచారం ప్రకారం" ఒక రాజు గుర్రంపై స్వారీ చేస్తూ నగరంలో ప్రవేశిస్తున్నాడు అంటే అతడు యుద్ధానికి వెళ్ళి వస్తున్నాడు అని అర్ధం.

అయితే, రాజు ఒక గాడిదపై స్వారీ చేస్తూ నగరంలో ప్రవేశిస్తున్నాడు అంటే అతడు శాంతితో వస్తున్నాడు అని అర్ధం. కనుక యేసు గాడిద మీద వస్తున్నాడంటే ఆయన సమాధాన కర్తగా వస్తున్నాడని ఇక్కడ అర్ధం.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, యేసు ప్రవేశిస్తున్న నగరం దేవుని చేత విడిచిపెట్ట బడినది మరియు దేవుని చేత తిరస్కరించబడిన పట్టణం.
🔹అందుకే యేసు యెరుషలేము చూచి దుఖించినట్లు వ్రాయబడినది. అందుకే సమాధానం లేని ఆ పట్టణానికి సమాధానం కలుగజేయుటకు యేసు సమాధానకర్తగా వచ్చుచున్నాడు.  

ప్రియ దేవుని బిడ్డలారా! ఈనాడు అనేక నగరాల గురించి, కుటుంబాల గురించి హృదయాల గురించి ప్రభువు ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఎవరికీ సమాధానం లేదు.

ఈ దినాలలో రాజ్యం మీదికి రాజ్యం దండెత్తుతూ యుద్ధవాతావరణంలో ప్రపంచం సమాధానం లేకుండా ఉంది.  అనేకులు నిజదేవుని ఎరుగక సమాధానం లేక వేదన పడుచున్నారు. సమాధానం కలుగుటకు ఏకైక మార్గం యేసు ద్వారా మాత్రమే.  ఉంది.

అందుకే సమాధానం కలుగజేయుటకు ఈ లోకానికి వచ్చాడు. అటువంటి ఈ సమాధాన కర్తను ఎరిగినవారు ధన్యులు.

7. రారాజు యెరూషలేము ప్రవేశం ఆయన ఏలుబడి అధికారాన్ని తెలియ జేయుచున్నది:

(జెకర్యా 9:10 సముద్రమునుండి సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతము వరకు అతడు ఏలును.)

యేసు యెరూషలేము ప్రవేశం చేసినప్పుడు ఎందుకు అంత భారి సంఖ్యలో జన సమూహాలు కూడి వచ్చారు? యెరూషలేము ప్రవేశానికి కొద్ది రోజుల ముందే యెరూషలేముకు అతి సమీపంలో ఉన్న బేతని గ్రామంలో యేసు తన మిత్రుడైన లాజరును శక్తితోను అధికారంతోను మృతులలో నుండి లేపి గొప్ప అద్భుతం చేసినాడు.

ఆవార్త యెరూషలేము పట్టణమంతా దావానలంలా వ్యాపించింది.  అది యేసుకు పట్టణంలో అమితమైన ప్రజాదరణను పెంచినది. అందువలన, రారాజు యెరూషలేములో ప్రవేశించిన ఆ విజయోత్సవ రోజున, లాజరును లేపిన యేసును చూడటానికి "భారీ జన సమూహాలు" కదలి వచ్చాయి.

(యోహాను 12:17-19  ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి.   ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి)

ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని( 18) అని యోహాను వ్రాసిన మాటలు మనం గమనించాలి. లాజరును యేసు మృతులలో నుండి లేపుట అను సూచికక్రియను గూర్చిఒక మాట ఇక్కడ చెప్పాల్సిన అవసరముంది. సూచికక్రియ అను పదాన్ని గ్రీకులో డ్యునమిస్ అని అంటారు. దీని అర్ధం “శక్తివంతమైన కార్యం.”

(డ్యునమిస్ అను గ్రీకు పదం నుండి వచ్చిన పదమే డైనమైట్ అనగా శక్తివంతమైనది). ఇదే డ్యునమిస్ అను పదం అపొస్తలుల కార్యములు 1: 8లో కూడా వాడబడినది.  (అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు.)

శక్తివంతమైన రాజ్యాధికారం కోసం ఉపయోగించే పదం. ఇది ప్రభువు యొక్క శక్తివంతమైన రాయల్ పవర్ చూపించు చున్నది. ఈనాడు కూడా ప్రభువు చాల శక్తివంతమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన శక్తివంతమైన స్వస్తతలు ఆయన రాజ్య శక్తిని చూపిస్తూ ఉన్నాయి.

ఆయన శక్తిగూర్చి పౌలు మాటల్లో మనం చూస్తే,  (ఫిలిప్పి 2:9  అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామ మునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.)

ఇక్కడ మనకొక ముఖ్యమైన సందేశం ఉంది. మరోసారి 17వ వచనాన్ని గమనించండి. ఆనాడు ప్రభువుతో కూడా ఉన్న ప్రజలు సాక్ష్యమిచ్చి నట్లుగా మనం చూడగలం. (యోహాను 12:17  ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.)

🔹 శక్తివంతంమైన ప్రభువు బిడ్డలముగా మనం కూడా శక్తివంతమైన సాక్షులుగా ఉండాలి. ఆనాడు శక్తివంతమైన సాక్ష్యాల ద్వారా సువార్త వ్యాప్తి కొనసాగింది.

యేసు చేసిన శక్తివంతమైన అద్భుతాలు ఇతరులను ఒప్పించేందుకు మరియు విశ్వాసం తీసుకురావడానికి గొప్ప శక్తి కలిగి ఉన్నాయి. క్రీస్తు యొక్క రక్షణ కృపను గురించి సాక్ష్యమివ్వటం అనేది  ఏ కాలంలోనైనా ఇవాంజలిజం యొక్క శక్తివంతమైన మరియు ముఖ్యమైన భాగం. అలాంటి శక్తివంతమైన సాక్ష్యాలు ప్రభువును వ్యతిరేకిస్తున్న పరిసయ్యులను కలవర పెట్టినట్లుగా క్రీస్తు వ్యతిరేకులను కలవరపరుస్తాయి.

ఇటువంటి శక్తివంతమైన సాక్ష్యాలు చెప్పే తన బిడ్డలకు మద్దతుగా దేవుడు తన  అద్భుత శక్తిని ఇంకా వారికి అనుగ్రహిస్తాడు.

ముగింపు: ఆనాడు యెరూషలేములోకి యేసు విజయవంతమైన ప్రవేశానికి మద్దతుగా ప్రజలు తమ శక్తివంతమైన సాక్ష్యాలతో స్పందించారు.

మరి ఈనాడు మన జీవితాలలోకి యేసు విజయవంతమైన ప్రవేశానికి మన ప్రతిస్పందన ఏమిటి? రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన మన జీవితాలలోనికి వచ్చి మన ఆత్మలను రక్షించిన విధానం గురించి మనం ప్రభువుకు శక్తివంతమైన సాక్షులుగా ఉంటున్నామా?

 కాబట్టి, ఈ మట్టలాదివారం సందర్భంగా మనం కూడా మరియొకసారి పరిశీలన చేసుకొని ప్రభువుకు భూదిగంతముల వరకు శక్తివంతమైన సాక్షులు ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్దపరచును గాక! ఆమెన్!!

దైవాశ్శీసులు!!!

From the desk of...
Pastor Jyothi Raju Vemula
(Soli Deo Gloria)

Immanuel Bible College
NIDUBROLU

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics