-:A:B:C:D:E:F:G:H:I:J:K:L:M:N:O:P:Q:.R:S:T:U:V:W:X:Y:Z:-

13 May 2019

యేసు ప్రార్ధన ... ప్రార్ధంచే సమయాలు ?


ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడై యుండి కూడ, ఆయన ఎంతగానో ప్రార్థన చేసెవాడు. ఆయన ప్రార్థించే స్థలాలు: తోటలలో, అరణ్యములలో, కొండల పైన, ప్రార్ధంచే సమయాలు: ఉదయముననే, సాయంకాలమందు, రాత్రంతా ప్రార్ధిస్తూ ఉండేవాడు. ప్రభువైన యేసు మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన ప్రార్ధించడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించాడు.
1. బోధించటానికి:
మార్కు1:35 లో యేసు ప్రభువు వారు ఉదయ కాలములో ప్రార్ధించడానికి అరణ్యములోకి వెళ్ళినాడు. 36 వ వచనములో ఆయన బోధంచుటకు ఇతర గ్రామములకు వెళ్ళినట్లుగా వ్రాయబడివుంది. ప్రతి ఉదయమున (యెషయా 50:4) తండ్రితో గడిపి ఆ తరువాత బోధించెవాడు. ప్రభువైన యేసు క్రిస్తు జీవితమంతా ప్రార్ధనామయము, తన పరిచర్యను ప్రార్ధనతొ ప్రారంభించాడు, నలువది దినములు ఉపవాసముండి, ప్రార్ధించినాడు. తన పరిచర్య ముగింపులో గెత్సమనే తొటలో ఆ రాత్రి ప్రార్థించాడు, చివరకు సిలువలో వ్రేలాడుతూ కూడా ప్రార్ధించాడు. అ.కా 4:30లో శిష్యులు ప్రార్ధన చేసిన తరువాత గొప్ప ధైర్యముతొ బోధించినారు. బోధించెవారు, సాక్ష్యం చెప్పేవారు, సువార్తికులు, సండె స్కూలు టీచర్లు వీరంతా ప్రభువు వలె వాక్యాన్ని ప్రకటించక ముందు ఎక్కువ సేపు ప్రార్ధనలో గడపాలి.
2. శోధన తప్పించుకోవడానికి:
మత్తయి 14:23లో ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదు వేల మంది భుజించిన వారిలొ కొందరు యేసు ప్రభువును రాజుగా చేయాలని తలంచారు. అది దేవుని చిత్తము కాదు, ఈ ఆలోచన సాతాను ప్రేరేపణ వలన వచ్చినదే, రాజు అయినవాడు ఏవిధంగా సిలువకు ఎక్కగలడు? అవును యేసు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కానీ మొదటి రాకడలొ ఆయన రాజుగా ఉండడానికి రాలేదు అయితే అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచనక్రయధనముగా ఇవ్వడానికి వచ్చినాడు. రాజుగా చేయాలన్న ఈ శోధనను తప్పించుకొవడానికి యేసు వెంటనే కొండ మీదికి ప్రార్ధన చేయడానికి వెళ్ళినాడు. "మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి" మత్తయి 26:41. ప్రార్ధన లేమి మనలను అనేకమైన శోధనలలోనికి నడిపిస్తుంది. ప్రార్థనా కొరత వలన ఈనాడు వ్యక్తిగత జీవితాలలో, కుటుంబాలలో, మరియు సంఘాలలో అనేక శోధనలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభువే శోధనను తప్పించుకొవడానికి ప్రార్థన చేసినప్పుడు, మనము కూడ ఆయన మార్గములో వెళ్ళవలసి ఉంది.
3, నిర్ణయాలు తీసుకోవడానికి:
లూకా 6:12 ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభువు రాత్రంతా ప్రార్ధించినాడు. ఈ లోకాన్ని తలక్రిందులు చేయడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి, అనేకులు నిత్యరాజ్యములో చేర్చబడడానికి, ఈ గొప్ప పని కొరకు ఆయనకు పన్నెండుగురు అపోస్తలలు అవసరం. రాత్రంతా వారి కొరకు ప్రార్ధించి, ఉదయ కాలములో శిష్యులను పిలిచి, వారిలో పన్నెండుగురు అపోస్తలలును ఏర్పరచుకొన్నాడు. మనమైతే ప్రార్థనలో కనిపెట్టకుండా, దేవుని చిత్తము ఏమిటో తెలుసుకోకుండానే, హాడావుడి నిర్ణయాలు తీసుకొని, ఆ తరువాత నష్టపోయిన సందర్భాలు అనేకం.
4. ప్రార్ధనాపరుల కొరకు :
ఆయన ఒక చోట చేరి ప్రార్ధించుచుండెను లూకా 11:1. యేసు ప్రార్ధించుచుండగా ఆయన శిష్యులు, మాకు కూడ ప్రార్ధన నేర్పమని అడిగారు. బాప్తీస్మమమిచ్చు యోహాను, ఆయన శిష్యులు ప్రార్ధించుచున్నారు అయితే మాకు ప్రార్ధించుట తెలియదు. యేసు ప్రభువు ప్రార్ధించడం వల్ల, వారు పురికొల్పబడి, వాళ్ళకు కూడ ప్రార్ధన భారము పెరిగింది. మనము ప్రార్ధించితే, ఇతరులు పురికొల్పబడి వారు కూడ ప్రార్ధన చేయడం ప్రారంభిస్తారు. ఈనాడు సంఘానికీ ప్రార్ధనాపరులు అవసరం అది మనతో ప్రారంభమవ్వాలి.
5. శ్రమలు ఎదుర్కోవడానికి:
ప్రభువు సిలువ, శ్రమలు ధైర్యంగా ఎదుర్కోవడానికి గెత్సమనే తోటలో ఆ రాత్రి ప్రార్ధించినాడు, మత్తయి 26:36. మనము ప్రార్ధించినప్పుడు దేవుని చిత్తమయితే శ్రమలు తొలగిస్తాడు, ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే ఆ శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవడానికి తగిన కృపను మనకు ఇస్తాడు. యేసు మూడు సార్లు ప్రార్ధిస్తాడు, పౌలు కూడ మూడు సార్లు ప్రార్ధన చేసినాడు, దేవుడు ఆయనకున్న ఆ ముల్లును తొలగించ లేదు కానీ నా కృప నీకు చాలును అని చెప్పినాడు. "మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్ధన చేయవలెను (యాకోబు 5:13). మనం ప్రార్ధించినప్పుడు, దేవుడు మన శ్రమలను తొలగించి మనకు క్షేమాన్ని ఇస్తాడు.
6. క్షమించండం కొరకు :
యేసు సిలువలో వ్రేలాడుతూ, "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" (లూకా 23:34). ప్రభువైన యేసు జీవితమంతా ప్రార్ధనామయమే. ఏ వ్యక్తి ప్రార్ధిస్తాడో అతడు ఇతరులను సులభంగా క్షమించగలడు. ప్రార్ధన లేమి హృదయాన్ని కఠిన పరుస్తుంది. ప్రార్ధించే వ్యక్తి ఇతరులను క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటాడు.
7. ముఖ తేజస్సు కొరకు:
"ఆయన ప్రార్ధించుచుండగా ఆయన ముఖరూపము మారెను" (లూకా 9:29). భక్తులు, పరిశుద్ధులు ప్రార్ధించినప్పుడు వారి ముఖము కాంతివంతంగా ఉండేది. సీనాయి కొండ మీద దేవునితో గడిపిన మోషే ముఖచర్మము ప్రకాశించింది, ప్రార్ధనలేని వ్యక్తి ముఖములో చింత, విచారము ఉంటాయి (ఫిలిప్పు 4:6). నెమ్మది, సమాధానము కొరకు ఎక్కువగా ప్రార్ధించాలి.
ప్రియ స్నేహితుడా, సహోదరీ! శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను, కన్నీళ్ళతోను ప్రార్ధన చేసిన యేసు ప్రభువు వారి ప్రార్ధనా జీవితం మనముందు గొప్ప మాదిరిగా ఉంది. ప్రభువుకు, ప్రవక్తలకు, పరిశుద్ధలకు అంత ప్రార్ధన అవసరమయితే, సామాన్య విశ్వాసులమైన మనకు ప్రార్ధన ఎంత అవసరం! ప్రార్ధనా జీవితాన్ని ప్రారంభిద్దాము, దేవుని ఆశీర్వాదాలను పొందుకొందాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!

No comments:

Post a Comment

Join Telegram

Join Telegram
Telugu Christian Lyrics