మన కన్నులు తెరచు యేసు.......
(లూకా 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.)
యేసు యొక్క పునరుత్థానం మొదటి ఆదివారమున ఐదు సార్లు తన శిష్యులకు దర్శనం ఇచ్చాడు.
👉 మగ్దలేనే మరియకు,
👉 ఇతర స్త్రీలకు,
👉 ఎమ్మాయి మార్గములోని ఇరువురు శిష్యులకు,
👉 సీమోను పేతురుకు మరియు
👉 తోమా లేకుండా ఉన్న పదిమంది శిష్యులకు ఆయన దర్శనం ఇచ్చాడు.
ఈ ఐదు దర్శనాలలో కూడా అత్యంత మనోహరమైనది ఎమ్మాయి మార్గములో యేసు ఇద్దరు శిష్యులకు ఇచ్చిన దర్శనం. వారితో నడుస్తూ ప్రభువు సంభాషణ చేయడం, ఈ సంభాషణలో ప్రభువును సిలువ వేసిన తరువాత శిష్యుల యొక్క స్థితిగతులను గురించిన విషయాలు యేసు తెలుసుకోవడం ఈ సందర్భంలో మనం చూడగలం.
ఈ ఎమ్మాయి వృత్తాంతం కేవలం లూకా సువార్తలోనే వ్రాయబడి యున్నది. ఈ ఇద్దరు శిష్యులలో ఒకరి పేరు క్లెయొపా అని వ్రాయబడినది. బహుశా ఆ రెండవవాడు లూకా అయివుండాలని వాఖ్యాన కర్తల ఊహ. కారణం సువార్తీకులు తమ పేర్లను గ్రంధంలో వ్రాసుకోలేదు గనుక. ఆ ఇద్దరు శిష్యులు యేరుషలేమునకు ఆమడ దూరములో ఉన్న అనగా షుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు పోవుచూ యేసు సిలువ వేయబడుటను గూర్చి ఒకరితో నొకరు మాటలాడు కొనుచుండిరి. ఈ ఎమ్మాయి వృత్తాంతంలోని కొన్ని ఆత్మీయ విషయాలను పరిశీలన చేద్దాం.
1. వారి బాధను తెలుసుకోవాలని వారితో నడిచిన యేసు: యేసు సిలువ సందర్భంగా జరిగిన భయంకరమైన కార్యములను బట్టి ఆ ఇద్దరి శిష్యుల మనస్సులు, కలత చెంది, ఎంతో దుఃఖముతో నిరాశతో వారు మాటలాడుచూ ఎమ్మాయి గ్రామమునకు పోవుచున్నారు. (లూకా 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడదూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకరితో నొకరు సంభాషించుచుండిరి)
అలా మాట్లాడుకొంటూ, చర్చించుకొంటూ ఉండగా యేసు తానే వారిని వెదకి కనుకొని దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు.(లూకా 19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.)
ఆదామును వెదకిన దేవుడు, సమరయ స్త్రీని వెదకి రక్షించిన ప్రభువు, జక్కయ్యను వెదకి రక్షించిన ప్రభువు, నిన్ను నన్ను కూడా వెదకువాడు.
“మీరు దుఃఖంతో నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొంటున్న సంగతి ఏమిటి?” అని ఆయన వారినడిగాడు. యేసు తరచుగా ఇలాంటి ప్రశ్నలు అడిగేది తనకు జవాబు తెలియక కాదు. వారు తమ ఆలోచనలను వారంతట వారే బయటికి చెప్పాలనే. ప్రభువు ఆ రీతిగా వారిని అడిగినాడు. అలనాడు ఆదాము హవ్వలు చెట్లచాటున దాగియుండగా “అదామా! ఎక్కడున్నావు” అని ప్రభువు వారిని అడిగి యున్నాడు. వారు ఎక్కడున్నది వారిచేతనే ఒప్పించి చెప్పించాలని ప్రభువు ఉద్దేశ్యం.
2. కండ్లు మూయబడిన శిష్యులు: (లూకా 24:16 అయితే వారి కండ్లు మూయబడి ఉన్నవి గనుక వారాయనను గుర్తుపట్టలేదు.) వారు యేసును గుర్తు పట్టకుండా దేవుడే వారి కళ్ళు మూశాడు. ఎందుకంటే వారి కళ్ళను వాస్తవ పరిస్థితులను చూడకుండా దేవుడు మూయడంలో ఆయన ఒక ప్రయోజనం కలిగి ఉన్నాడు. వారి నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు.
యేసు ఇక్కడ వారి కన్నులను మూయడంలో ఆయన దయలేనివాడు అని కాదు అర్ధం. దేవుని యొక్క వాగ్దానాలపై వారి నమ్మకం గురించి కొన్ని పాఠాలను వారు నేర్చుకోవటానికి వీలుగా ఆయనే వారి కన్నులను మూసి యున్నాడు. ఇది శిష్యులైన వారి నమ్మకానికి పరీక్ష. జరుగబోవు చున్న సంఘటనలను గూర్చి ఆయన ఎన్నో సార్లు తన శిష్యులకు చెప్పియున్నాడు గాని వారు వాటిని నమ్మలేని వారుగా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు మనం కన్నులు మూయబడి నప్పుడు అనగా చిక్కుల్లో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నపుడు, ఏదారి కానరాని పరిస్థితులలో ఉన్నప్పుడు, అనగా మన మనోనేత్రాలకు దారి తెలియనప్పుడు ప్రభువు మీద పూర్తి నమ్మకం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు.
3. శిష్యుల దృష్టిలో యేసు ఎవరు?: వారు తమ వేదనను ప్రభువుకు వివరించుచూ తమ మాటలలో యేసును కేవలం ఒక ప్రవక్తగా వారు చెప్పుచున్నారు. (లూకా 24:19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై యుండెను. లూకా 24:21 ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి)
ఆ శిష్యులు మాటలను బట్టి చూస్తే యేసు మెస్సియాగా వచ్చాడని, ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలో శిష్యులైన వారికి ఏమి చేయాలో, మరియు ఆయన వాటిని ఏవిధంగా చేయవలసి యున్నదో వారు ముందుగానే ఆలోచించి ఎన్నో ఆశలు ఆయన మీద పెట్టుకున్నారు. కానీ వారు ఊహించుకున్న ఆలోచనల ప్రకారం ప్రభువు వెళ్ళలేదు, చేయలేదు అందును బట్టి వారి ఆశలన్నీ పూర్తిగా విఫలమయ్యాయి. వారి ఆశ మరియు విశ్వాసం వృధా అయినట్లు వారు మాట్లాడుకుంటున్నారు.
అయితే దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డల గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ ఆయన ప్రణాళిక ప్రకారం నడవాలి గాని మనం ఎదురు చూస్తున్నట్లుగానే పరిస్థితులను ఆయన మార్చాడు. దానికి బదులుగా మనమే ప్రభువు ప్రణాళిక ప్రకారం మనలను మనం మార్చుకొని ఆయనకు లోబడవలసి యున్నది.
4. అల్ప విశ్వాసం గలవారుగా ఉన్నారు: “అవివేకులరా, మందమతులారా!” అని ప్రభువు వారి అల్పవిశ్వాసం చూచి గద్దిస్తున్నాడు. (లూకా 24:25 అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా..)
యేసు పునరుత్తానుడైన తరువాత ఖాళి సమాధిని దర్శించిన మహిళల యొక్క నివేదికలను ఈ శిష్యులైన వారు విన్నారు. తాము కూడా ఖాళీ సమాధిని చూసారు, కాని వారు విశ్వసించలేదు. మృతులలోనుండి యేసును లేపటానికి దేవుడు చేసిన అత్యద్భుతమైన కార్యం వారి ఊహలకు అందనిదిగా ఉన్నది. యేసు ఎవరో ఎంత శక్తివంతుడో ఈ శిష్యులైన వారు ఎన్నడూ పట్టించుకోలేదు ఆయనను గుర్తించలేదు. ఇదే స్థితిలో ఈనాడు మనం కూడా వున్నాము. మనము కూడా ప్రభువు యొక్క అద్భుత కార్యాలను వివరించలేము అర్థం చేసుకోలేము ఎందుకంటే దేవుని గురించి ఎప్పుడు మనం తక్కువగానే ఆలోచిస్తాము గనుక.
ప్రియదేవుని బిడ్డలారా! ఈ శిష్యులు చేసిన అదే పొరపాటు మనం చేయకుండా జాగ్రత్తగా ఉండవలెను. దేవుడు ఒక్కోసారి తన చిత్తాన్ని సహజంగానే అనగా మనం ఊహించిన రీతిగానే నేరవేర్చుతాడు, కాని ఒక్కోసారి మనం ఊహలకు అందని రీతిలో తన చిత్తాన్ని నేరవేరుస్తాడు.
దేవుని విధానం ఒక్కోసారి మనకు అర్ధం చేసుకోలేని విధానంలో ఉంటుంది. ఈ ఇద్దరు శిష్యులకు ఏదో జరిగిందని తెలుసు, కాని ఆ జరిగినది వారి ఊహకు అందనిదిగా ఉన్నది అనగా అది వారి విశ్వాసం యొక్క స్థాయికి మించినదిగా ఆ కార్యం ఉన్నది. అనగా ఈ ఇద్దరు శిష్యులకు యేసు అంటే ఎవరో తెలుసు కాని పూర్తిగా తెలియదు. ఈ దినాలలో చాలామంది ఇదే విధంగా ఉంటున్నారు. అనగా యేసుని గురించి పూర్తిగా తెలియని వారుగా ఉంటున్నారు. ఆయన శక్తి ఏమిటో గుర్తించలేని వారుగా ఉంటున్నారు.
5. ప్రభువు వారి కన్నులను వాక్యం ద్వారా తెరచు చున్నాడు: (లూకా 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి;)
ప్రభువు మన కన్నులు తెరచువాడు. శారీరకంగా, మానసికంగా ఆత్మీయంగా కూడా ప్రభువు మన కన్నులు తెరచువాడు. ప్రభువు వారి అపనమ్మకాన్ని పోగొట్టి వారి కన్నులు తెరచుటకు వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు.
విస్తారమైన లేఖన భాగాల ద్వారా వారి కన్నులు తెరస్తున్నాడు. పాతనిభంధన ప్రవచనాలు యేసు ద్వారా ఎలా నేరవేర్చబడవలసి యున్నదో సమస్త ప్రవక్తల లేఖనాలను వారికి తెలుపుచున్నాడు.
6. శిష్యుల హృదయాలు మండించిన లేఖన భాగాలు:(లూకా 24:32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచు చున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.)
11 కిలోమీటర్లు వారు సుదీర్ఘంగా మాట్లాడుకుంటూ నడిచారంటే బహుశా యేసు వారికి మెస్సియాను గురించిన ఎన్నో ప్రవచనాలు వివరంగా విస్తారంగా వారి హృదయాలు మండేలా చెప్పిఉండాలి. వారి హృదయాలను మండురీతిగా ప్రభువు తన గురించి చెప్పిన లేఖన భాగాలు బహుశా ఏమైఉండాలి? (లూకా 24:27 మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.)
పాత నిబంధన ప్రవక్తలు బాధలనుభవించే అభిషిక్తుణ్ణి గురించి, మహిమతో రాబోయే అభిషిక్తుణ్ణి గురించి కూడా రాశారు. అయితే ఆ కాలం యూదా ప్రజలు సిలువ శ్రమను అనుభవించే ప్రభువును మర్చిపోయి మహిమ రాజుగా వచ్చే మెస్సియా కోసమే ఎదురుచూశారు. వారి గ్రహింపులోని లోపాన్ని యేసు ఇప్పుడు సరి చేస్తున్నాడు. మోషే (బైబిలులో మొదటి ఐదు గ్రంథాలు) నుంచి కూడా పాత నిబంధన అంతా యేసుప్రభువును గురించిన ప్రవచనాలతో నిండి ఉంది.
మనం కూడా నమ్మకం, విధేయత కనపరిస్తే యేసుప్రభువు పాతనిబంధన సత్యాలను మనక్కూడా వివరిస్తాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా, తన సేవకుల ద్వారా ఇది చేస్తాడు
మెస్సియా ప్రారంభ ప్రవచనాలు మొదలుకొని అనగా బహుశా యేసు ఆదికాండము 3: 15 లో మొదలుపెట్టి, సర్పంతో దేవుడు మాట్లాడిన భాగం చెప్పిఉండాలి. (“మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను”)
అక్కడి నుండి ప్రభువు బహుశా వారిని ద్వితీయోపదేశ కాండము 18:16 కి మళ్ళించి ఉంటాడు, " నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును)
మరియు అక్కడి నుండి యెషయా 7:14 కు: (“కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును")
అక్కడి నుండి యేసు వారిని యెషయా 53: 3 కు తీసుకువెళ్లి ఉంటాడు: ("అతడు తృణీకరింపబడిన వాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను”).
ఆ తరువాత బహుశా యెషయా 53: 7 గురించి చెప్పిఉండాలి: (“అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.”)
యేసు వారికి జెకర్యా 12:10 ఉద్బోధించి ఉండాలి: ("వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.”)
7. తనను తాను ప్రత్యక్ష పరచుకొనిన యేసు: యేసు తాను ఎవరో ఎందుకు వచ్చాడో, తాను రావడం ఎందుకు అవసరమో మొదలగు విషయాలన్నీ స్పష్టంగా వాక్యం ద్వారా వారికి ప్రత్యక్షంగా ఒక చిత్ర రూపంలో చూపించాడు కాబట్టే వారి హృదయాలు మండినవి. (లూకా 24:29 వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.)
ప్రొద్దు గ్రుంకు చీకటి సమయాన ఎమ్మాయి రహదారి ప్రమాదకరమైనది. కాని ప్రభువు ఆ చీకటిలో వారితో నడిచాడు వారితో మాట్లాడి, లేఖనాలను వివరించాడు. ఇంటిలోనికి వచ్చాడు రొట్టె విరిచాడు. తనను తను ప్రత్యక్ష పరచుకున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా! దీనిని బట్టి మనం నేర్చుకోవలసినది ఏమంటే, తనగురించి లేఖనాలు చెప్పేవి మాత్రమే మనం నమ్మవలసి యున్నదని యేసు కోరుకున్నాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? పరిశుద్ద గ్రంథం యేసు ఎవరో హృదయాలు మండేలా సాక్ష్యం ఇస్తుంది.
ఆయనను తెలియని వారి కళ్ళను తెరవడానికి నేడు కూడా దేవుడు తన వాక్యాన్ని అద్భుతంగా ఉపయోగిస్తున్నాడు.
కేవలం ఆయన తన వాక్యం ద్వారా మాత్రమే తనను తాను ప్రత్యక్ష పర్చుకొంటాడు. వాక్యం ద్వారా కన్నులు మరియు హృదయాలు తెరుస్తాడు.
ఇక్కడ రెండు ముఖ్య విషయం మనం గమనించాలి.
మొదటిగా వారు యేసును గుర్తుపట్టగానే ఆయన వారికి ఎందుకు అదృశ్యుడాయెను? (లూకా 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.) కేవలం వాక్యం ద్వారా మాత్రమే యేసు మనకు ప్రత్యక్షం అగుటకు ఇష్టపడుచున్నాడు.
ఆఇద్దరు శిష్యులు హృదయాలలో యేసు వాక్య రూపంలో ప్రత్యక్షంగా ఉన్నాడు. మనకు ఆయనతో ఉన్న సహవాసము ఆయనను మన కళ్ళతో చూసే సామర్ధ్యం మీద ఆధారపడి ఉండదు గాని ఆయనతో మన సహవాసం, వాక్యం ద్వారా ఆయనను మనోనేత్రాలతో చూచే సామర్ధ్యంమీద ఆధారపడి ఉంటుంది.
యేసు ఆయన వాక్యపు సత్యాల ద్వారా మన కళ్ళు తెరిచి మనకు తనను తాను వెల్లడిచేస్తాడు.
రెండవదిగా, భోజనం దగ్గర ఆయన తనను తాను ప్రత్యక్ష పరచుకున్నాడు. పునరుత్తానుడైన యేసు భోజన సందర్బాలలో తనను తాను శిష్యులకు కనపరచుకొన్నట్లు ఈ క్రింది వాక్య భాగాలలో చూడగలం. (లూకా 24:41 అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. 45 అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి,
యోహాను 21:12 యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.)
భోజనం సహవాసాన్ని తెలియజేస్తున్నది. వారు యేసుతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన వారికి తనను తాను వెల్లడించు కున్నాడు. యేసు తన వాక్యపు సత్యాల ద్వారా మన కళ్ళు తెరిచిన మనకు తనను తాను వెల్లడిచేస్తాడు.
శిష్యులు యేసుతో సహవాసం కలిగి ఉన్నప్పుడే ఆయన వారికి తనను తాను వెల్లడించుకున్నాడు.
లేఖన సత్యాల ద్వారా వారి కళ్ళు తెరవబడి, భోజన సహవాసం ద్వారా వారి హృదయాలు తెరువబడి, ప్రభువును గుర్తించి, తమ సాక్ష్యాలను ఒకరితో ఒకరు పంచుకొనసాగిరి.
వారు అనుభవించిన ఉత్సాహం మీరు ఊహించగలరా? వారు ఒకరితో ఒకరు, "ఆయన మనకు లేఖనములను వివరిస్తున్నప్పుడు, ఆయన ఎమ్మాయి దారిలో మనతో మాట్లాడుతున్నప్పుడు "మన హృదయాలు మనలో మండలేదా” అని భావోద్వేగంతో ఒకరినొకరు పురికొల్పుకున్నారు.
పునరుత్తానుడైన యేసు ద్వారా మన కళ్ళు తెరవబడినప్పుడు మనం ఇతరులు కళ్ళు తెరబడుటకు సువార్త సాక్ష్యాలు చెప్పాలి. వాక్యం ద్వారా ప్రభువును గుర్తు పడదాం. మనలను రక్షించుట కొరకు ఆయన చేసిన బలియాగాన్ని మన కన్నులలో ఉంచుకుందాం
ప్రియ స్నేహితుడా! ప్రొద్దు గ్రుంకు చీకటి సమయంలో ప్రియ ప్రభువు నీతో పాటు నడుస్తున్నాడని నీకు తెలుసా? ఆయన నీతో చెప్పే మాటలు నీ హృదయాన్ని మండించడం లేదా? నీ జీవితంలో ఆయన ఉనికిని గురించి సాక్ష్యమివ్వడానికి సిద్ధంగా ఉన్నావా?
చీకటి ముసిరే నీ జీవిత ఎమ్మాయి దారులలో నీవు తనను నీ ఇంట్లోకి ఆహ్వానించాలని ఆయన కోరిక. శిష్యులు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించారు. నీవు ఆహ్వానించకపోతే, ఆయన ప్రవేశించడు. ఆయనెవరో తెలియకుండానే వారాయన్ను ఆహ్వానించారు. అద్భుతంగా వారి కన్నులు తెరవబడినాయి. ఆయన ఎవరో తెలిసిన మనము ఆయనను మనం ఇంటిలోనికి ఆహ్వానించుటకు, ఆయన ద్వార మన కన్నులు కూడా తెరవబడుటకు పరిశుద్దాత్మ దేవుడు మనకు సమృద్ధిగా తన సహాయం అనుగ్రహించును గాక! ఆమెన్!!
దైవాశ్శీసులు!!!